తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని ఆగ్రహించారు. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని ఆగ్రహించారు.
రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా కూడా బోగస్ అన్నారు. నిన్న… రైతు సురేందర్ రెడ్డి….నేడు… రైతు సాగర్ రెడ్డి…. ఏ ఒక్కరి రుణం మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయారన్నారు. ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి ? అని ప్రశ్నించారు. ఏకకాలంలో అందరికీ 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి ? అని ప్రశ్నించారు. డిసెంబర్ లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి ? అని నిప్పులు చెరిగారు.