తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ ఎంపికయ్యారు. ఈ నెల 21లోపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కె.కేశవరావు రాజీనామాతో తెలంగాణలో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆయనకు కాబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో ఆ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక బరిలో అభిషేక్ మను సింఘ్విని దించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయన పేరును ప్రకటించారు.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు సీనియర్ నేత మను సింఘ్వీని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయడంపై…. విమర్శలు గుప్పించారు. రాజ్యసభకు నామినేట్ చేసేందుకు రాష్ట్రం నుంచి సమర్థుడైన ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్‌కు దొరకలేదా అంటూ మండిపడ్డారు. దిల్లీ బాసుల ఆదేశాలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తోలు బొమ్మల్లాగా కట్టుబడి ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు.