కేంద్రంపై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామంటు పార్లమెంట్‌లో కేంద్రం చేసిన ప్రకటన సిగ్గుచేటు అని సీరియస్ అయ్యారు మంత్రి కేటీఆర్. కుంచిత రాజకీయాల కోసమే ఐటీఐఆర్ రద్దు చేశారని… ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి కేంద్రం దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
బీజేపీ పార్టీ డిఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారన్న కేటీఆర్… ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సమానస్థాయిలో హైదరాబాద్ ఐటీకి అవసరమైన ఏదైనా పథకాన్ని ప్రకటించాలని కనీసం 50సార్లు కేంద్రాన్ని కోరామని గుర్తు చేశారు.
అయినా కూడా మోడీ ప్రభుత్వం హైదరాబాద్ ఐటీ ఈకోసిస్టమ్ కు నయా పైసా మందం సహాయం చేయలేదని.. ఐటీఐఆర్ రద్దుతో ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణకు జరిగిన నష్టంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఐటీఐఆర్ ప్రాజెక్టు కనుకే ఉండి ఉంటే ఈ ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టం ఆకాశమే హద్దుగా అద్భుతంగా ఎదిగేదని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యూబేటర్ టి హాబ్ -2 నిర్మాణాన్ని 450 కోట్లతో పూర్తి చేస్తే, దానికి కేంద్రం నుంచి పైసా సహాయం లేదని ఫైర్ అయ్యారు కేటీఆర్.