ఇండియన్ ఆర్మీకి చెందిన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ గురువారం ఉదయం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. సాంకేతిక లోపం తలెత్తడంతో జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. అనిల్ రాజన్న సిరిసిల్ల జిల్లావాసికి చెందిన వాడని అధికారులు తెలిపారు.
గాయపడిన పైలట్, కో పైలట్లను ఉధంపుర్ ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రమాద ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ధ్రువ్ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురవడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మృతి చెందిన జవాన్ అనిల్ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. జవాన్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. జవాన్ అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.