హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. భూముల వ్యవహారంపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయని.. వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీ నోరు విప్పరా? ఇవన్నీ చూస్తూ కూడా ఆయన మాట్లాడకపోతే ఎలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని పేర్కొంటూ.. దాన్ని వేలం వేయనున్నట్లు ఇటీవల టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ (HCU)భూమి లేదని .. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది.