పనిచేసే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు అస్సలు వదులుకోరని.. కచ్చితంగా ఆ సర్కార్ను మళ్లీ మళ్లీ ఆశీర్వదిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలపై తమకు అచంచల విశ్వాసం ఉందని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధి పంథాలో దూసుకుపోతోందని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి.. జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో ఏర్పడిన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించటం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. దేశానికి ఆర్థికంగా చేయూతనిచ్చే రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. భూపాలపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం హనమకొండ జిల్లాకు బయల్దేరారు. ఆ తర్వాత మహబూబాబాద్, జనగామలో పర్యటించి అక్కడి బహిరంగ సభలో పాల్గొననున్నారు.