రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ వేదికపై ప్రసంగించే అవకాశం వచ్చింది. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్’కు రావాల్సిందిగా కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. క్టోబరు 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయొవా రాష్ట్రంలోని డెమోయిన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధిని ప్రపంచానికి వివరించనున్నారు. ఈ సంవత్సరం జరగనున్న సమావేశంలో ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ సొల్యూషన్స్ టు అచీవ్ ఎ సస్టేనబుల్, ఈక్విటబుల్ అండ్ నర్షింగ్ ఫుడ్ సిస్టమ్’ అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు నేరుగా హాజరవుతారు.
ఈ ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత పదేళ్లలో రాష్ట్రం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను అనుసరించిందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. వాటి ఫలాలను ఈరోజు తెలంగాణ రైతాంగం అందుకుంటోందని.. ఆహార భద్రత అంశంలో దేశానికి కూడా తెలంగాణ భరోసాగా నిలుస్తోందని పునరుద్ఘాటించారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదికపై వివరించడానికి అందిన ఆహ్వానం.. తెలంగాణ విధానాలకు దక్కిన గౌరవం అని కేటీఆర్ పేర్కొన్నారు.