హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉన్న ప్రత్యేక ఆకర్షణలో ఇటీవల ఏర్పాటు చేసిన నీరా కేఫ్ ఒకటి. ఈ కేఫ్ ప్రారంభమై కొన్నే రోజులు అవుతున్నా దీనికి భారీగా ఆదరణ వస్తోంది. నగర వాసులు వీకెండ్లో ఎక్కువగా ఈ కేఫ్‌కు వస్తున్నారు. ఏకంగా రూ.16 కోట్లతో స్టార్ హోటల్‌ను తలపించేలా ఈ కేఫ్‌ను నిర్మించారు. అయితే ఇప్పుడు ఈ కేఫ్‌కు సంబంధించి ఓ విషయం బాగా చర్చనీయాంశమవుతోంది. దీన్ని ప్రారంభించి నాలుగు నెలలు అయిందో లేదో.. అప్పుడే దీన్ని లీజుకు ఇచ్చేందుకు పర్యాటకాభివృద్ధి టెండర్లు పిలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం బాగా చర్చనీయాంశమవుతోంది.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ, ఎక్సైజ్‌శాఖ కలిసి నిర్మించిన నీరా కేఫ్‌ను 2023 మేలో ప్రారంభించారు. అప్పట్నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తోంది. దాదాపు 500 మంది కూర్చునే ఏర్పాట్లున్నాయి. ఈ కేఫ్‌కు రోజూ దాదాపు వెయ్యి మందికిపైగా వస్తున్నారు. లీటర్ నీరాను రూ.300కు విక్రయిస్తున్నారు. గీత కార్మిక సంఘాల నుంచి నీరా కొనుగోలు, రవాణా ఖర్చు కలిపి లీటర్‌కు రూ.200కిపైగా అవుతోంది. గరిష్ఠంగా రోజుకు రూ.లక్ష వరకు లాభం వస్తోంది. అయితే, కేఫ్‌పై భారీ మొత్తాన్ని ఖర్చుచేసి.. నాలుగైదు నెలలకే లీజుకిచ్చే ప్రక్రియను మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది