మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ఉప ఎన్నికలలో విజయం సాధించి భవిష్యత్తులో ఎన్నికలకు పట్టు సాధించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి ఈ ఉపఎన్నిక అత్యంత కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు ముందు జరగనున్న ఈ ఉపఎన్నిక పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో టిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని దించుతారు అన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరందుకుంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. శనివారం మునుగోడు లో జరిగే సభలో కేసీఆర్ కూసుకుంట్ల పేరును ప్రకటించే అవకాశం ఉంది. అయితే మునుగోడు నుంచి బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చేసిన వ్యాఖ్యల నడుమ ఈ ప్రకటన రానుండడంతో మునుగోడు రాజకీయం ఆసక్తికరంగా మారింది.