ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దరఖాస్తులు ఇచ్చేందుకు జ్యోతిబాపూలే ప్రజాభవన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకునేందుకు నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దరఖాస్తుదారులు వచ్చారు. భూ సమస్యల పరిష్కారం, పింఛన్ల కోసం ఎక్కువ మంది అర్జీదారులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా ఏటూ తేలని తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎమ్మేల్యే దానం నాగేందర్ తమ ఇళ్ల స్థలాలను లాక్కొని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజాభవన్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ప్రకాశ్ నగర్ ఎక్స్‌టెన్షన్ బేగంపేట నుంచి వచ్చిన బాధితులు ఎమ్మెల్యే తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు. తమ ఇళ్ల స్థలాలు తమకే కావాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనను వీడియో తీస్తున్న దానం నాగేందర్ అనుచరుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు దక్షిణమండల డీసీపీ విజయ్ కుమార్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు.