తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న కుల గణనకు చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 9వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలలో కులగనన బిల్లును ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది.
బడ్జెట్ సమావేశాల అనంతరం కులాల వారీగా లెక్కలు తీసే ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఒక ప్రత్యేక యాప్ రూపొందించి… అందులో అన్ని కులాల జాబితాను పొందుపరచునున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు దాదాపుగా ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా? లేదా ‘ఓట్ ఆన్ అకౌంట్’ ప్రవేశపెట్టాలా? అని ప్రభుత్వం చర్చిస్తున్నట్లు సమాచారం.