ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేయడంతో రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ తడిసిముద్దయింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలోనే అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీం నగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
కాగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయు వ్య దిశగా ప్రయాణించి అక్టోబర్ 12న మధ్యాహ్నం తర్వాత ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది