ఇందిరా పార్కులో ఆటో డ్రైవర్ల మహాధర్నా కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సుల కారణంగా తాము నష్టపోతున్నామని.. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో, ప్రైవేటు ట్రాన్స్ ఫోర్ట్ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మహాలక్ష్మీ స్కీమ్ కు ముందు యావరేజ్ గా రూ.1000 సంపాదన ఉంటే.. ఇప్పుడు రూ.500 కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామి ఇచ్చింది. కానీ అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. యాప్ లతో అనుమతి లేకుండా నడుస్తున్న టూ వీలర్లను నిషేదించాలని కోరారు. సాధారణ మరణాలకు కూడా ప్రమాద బీమా వర్తింప జేయాలని ఆటో డ్రైవర్లు ప్రైవేటు ట్రాన్స్ పోర్టు జేఏసీ డిమాండ్ చేసింది. మరోవైపు ఆటో, ప్రైవేట్, ట్రాన్స్ ఫోర్టు డ్రైవర్ల మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకపై సందిగ్దం నెలకొంది. మరోవైపు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా అక్కడికి చేరుకోవడంతో ఇది రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దీక్ష అని పలువురు పేర్కొనడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.