మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలో వైపు మళ్లే అవకాశం ఉందని అటవీ అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అడుగుపెట్టొచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలోకి వస్తే ఏనుగుల మంద తీవ్రంగా నష్టం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించడం ఎలాగన్న అంశంపై దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఏనుగు కదలికల్ని కనిపెట్టాలని నిర్ణయించారు. అవి ఎక్కువగా రాత్రిపూటే సంచరిస్తాయని, అందుకే రాత్రిపూటా పనిచేసే థర్మల్ కెమెరా డ్రోన్లను కొనుగోలు చేయనున్నట్లు అటవీశాఖలో కీలక అధికారి తెలిపారు.
మహారాష్ట్రలో మంద నుంచి తప్పిపోయిన ఓ ఏనుగు ఏప్రిల్ తొలి వారంలో తెలంగాణ అడవుల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చింతలమానెపల్లి, పెంచికల్‌పేట మండలాల్లో భయాందోళనలు సృష్టించిన ఆ మగ ఏనుగు.. 14 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతుల్ని బలిగొంది. ఆ తర్వాత మహారాష్ట్రకు తిరిగివెళ్లిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి రాష్ట్రానికి ఏకంగా ఏనుగుల మందే వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తమయ్యారు.