తెలంగాణలో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు చేరికలు.. మరోవైపు తన కేడర్‌ను బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉండేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ నేతలను రంగంలోకి దించి.. ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 26వ తేదీన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రానికి రానున్నారు. ఆరోజున చేవెళ్ల సభలో ఆయన పాల్గొని దళిత డిక్టరేషన్ ప్రకటిస్తారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి వెల్లడించారు. ఇటీవల ధిల్లీలో ఖర్గేతో రెండుగంటలపాటు సమావేశమై ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు మల్లు రవి చెప్పారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం పారిపోతోందని బీఆర్ఎస్పై మల్లు రవి విమర్శలు చేశారు. ఎప్పటికైనా కాంగ్రెస్‌తోనే దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ ప్రకటించిన లిస్ట్‌ను చూస్తే గొర్రెల మందపై తోడేళ్లను వదిలిపెట్టినట్లు ఉందన్నారు. భూకబ్జాదారులు, దళిత బంధులో కమీషన్‌లు తీసుకున్నవారు, దోపిడీ దారులే లిస్టులో ఎక్కువగా ఉన్నారని ఎద్దేవా చేశారు.