కుటుంబ తగాదాలతో మంచు ఫ్యామిలీ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తాజాగా మరోసారి మంచు మనోజ్ తన సోదరుడు విష్ణుపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను ఇంట్లో లేనప్పుడు చొరబడి తన కారు, ఇంట్లో వస్తువులు దొంగతనం చేశాడని ఫిర్యాదులో మనోజ్ పేర్కొన్నాడు. జల్‌పల్లిలోని తన నివాసంలో విధ్వంసం జరిగిందని తెలిపాడు. దీని వెనక తన సోదరుడు విష్ణు ఉన్నాడని ఆరోపిస్తూ న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు మనోజ్.
తన కుమార్తె బర్త్‌డే కోసం రాజస్థాన్‌కు వెళ్లిన సమయంలో విష్ణు తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడని మనోజ్ ఆరోపించాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకెళ్లాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించి, కార్లను దొంగిలించాడని.. ముఖ్యమైన వస్తువులను పగులగొట్టి, ఇల్లు ధ్వంసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. చోరీకి గురైన కార్లు విష్ణు ఆఫీసు వద్ద లభ్యమైనట్లు తెలిపాడు. జల్‌పల్లిలోని తన ఇంట్లో 150 మందితో విష్ణు చొరబడి ఇంట్లో విధ్వంసం సృష్టించాడని ఆరోపించాడు. ఈ పరిణామాల గురించి తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు మనోజ్ తెలిపాడు.