ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో విభేదాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవు.. మా ఇద్దరి మధ్య వ్యక్తిగత అనుబంధం బాగుందని అన్నారు. కానీ.. ఒక విషయంలో బాధగా ఉంది. నా కంటే ఎక్కువ ప్రధాని మోడీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నే మందకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారు అని అన్నారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం లేదు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పక్కా ప్రణాళికతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయబోతున్నాం.. వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చే వరకు ఎలాంటి నోటిఫికేషన్లు కూడా ఇవ్వొద్దని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ లేకపోతే వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే శక్తి నాకు వచ్చేది కాదు. భవిష్యత్ లో న్యాయపరమైన చిక్కులు ఉండకూడదనే వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ 199 పేజీల నివేదిక ఇచ్చింది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.. ఇది ఎవరికీ వ్యతిరేకంగా చేసింది కాదు.