తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో భారీ ప్రక్షాళన జరిగింది. ఇంజినీర్లు,సైంటిఫిక్ స్టాఫ్‌లో దాదాపు 80 శాతం మందిని బదిలీ చేశారు. ఈ మేరకు పీసీబీ సభ్య కార్యదర్శి నీతూకుమారి ప్రసాద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అధికారులు, ఉద్యోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని పది మంది రీజనల్ అధికారులనూ బదిలీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, సైంటిఫిక్ విభాగాల్లో దాదాపు 90 మంది ఉండగా, వీరిలో 71 మందికి స్థానభ్రంశమైంది. కొందరికి మాత్రం సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నా మినహాయింపు లభించిందని.. ఆప్షన్లు ఇవ్వకుండా, ఓ ప్రాతిపదిక రూపొందించకుండా నిర్ణయం తీసుకున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. బదిలీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు ఛాయిస్ ఇవ్వకుండా ఇష్టమొచ్చిన చోటుకు బదిలీ చేశారని వాపోయారు.