మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30వ తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు తెలిపారు. స్థల కేటాయింపుపై ప్రభుత్వం, దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ ఆ తేదీల్లో ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. 1993లో మేడారం జాతర భవిష్యత్తు అవసరాల కోసం వరంగల్‌లోని కేంద్ర కారాగారానికి ఎదురుగా 1000 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగా.. ఇందులో ఏడాది క్రితం భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో ధార్మిక భవనాన్ని నిర్మించారు.
ఈ భవనాన్ని, స్థలాన్ని భద్రకాళి దేవస్థానం అధీనంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పూజారులు చెబుతున్నారు. స్థలం వనదేవతలదని, నిర్మాణ ఖర్చులను జాతర ఆదాయం నుంచి ఇస్తామని, స్థలం, భవనం అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మంత్రి సీతక్క, కలెక్టర్, దేవాదాయశాఖ అధికారులకు వినతి పత్రాలిచ్చినా స్పందన లేదని వాపోయారు. దీంతో చేసేదేం లేక ప్రభుత్వ తీరుకు నిరసనగా వనదేవతల గద్దెలు, ప్రాంగణానికి తాళాలు వేసి, ధర్నా నిర్వహించనున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, పూజారులు తెలిపారు.