ఎట్టకేలకు లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా మరణ మృదంగం మోగిస్తుండటంతో దాదాపు 17రాష్ట్రాల్లో కంప్లీట్ లాక్‌డౌన్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. తెలంగాణలో మాత్రం కేవలం నైట్ కర్ఫ్యూనే ఉంది. కాగా తెలంగాణలో కూడా లాక్‌డౌన్ పెట్టాలని ఎప్పటినుంచో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ దానిపై దృష్టి పెట్టారు.
ఈ రోజు మధ్యాహ్నం 2గంటలకు కేబినెట్ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే లాక్‌డౌన్ పెట్టేద లేదని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పిన ప్రభుత్వం.. మినీ లాక్‌డౌన్ వైపు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే రోజులో మధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్ పెట్టే ఆలోచన చేస్తోంది.
ఎందుకంటే లాక్‌డౌన్ పెట్టిన రాష్ట్రంలో కేసులు తగ్గట్లేదని, కంప్లీట్ లాక్‌డౌన్ పెడితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మినీ లాక్‌డౌన్ లేదా వీకెండ్ లాక్‌డౌన్ పైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. అయితే రమ్‌జాన్ తర్వాతనే ఆంక్షలు అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ నెల 15తర్వాతే ఏదైనా పెడుతారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటికి మినహాయింపు ఇవ్వనున్నట్టు సమాచారం.