తిరుపతి రుయా హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 10 మందికి పైగా మృతి చెందడంపై కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. అయ్యా ప్రధానమంత్రి, అయ్యా ముఖ్యమంత్రి చూస్తున్నారా మీరు చేసిన ఘనకార్యాలు అని ఆమె ప్రశ్నించారు. మీ అహంకారం, అవగాహన లేమితో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఆక్సిజన్ సరఫరా కూడా చేయలేని దిక్కుమాలిన స్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.
కోవిడ్ విభాగంలో ఆక్సిజన్ నిలిచిపోవడం అంటే ప్రభుత్వ నిర్వహణ ఎలా వుందో అర్ధం అవుతుంది అని అన్నారు. ఒకవైపు బెడ్స్ లేక సగం మంది కోవిడ్ రోగులు రోడ్ల పైన, అంబులెన్స్ లలో, చెట్ల కింద చనిపోతుంటే, మిగిలిన వారిని ఆక్సిజన్ అందించలేక ప్రభుత్వం చంపుతోంది అని, ఆ చనిపోయిన వారిలో మీ కుటుంబ సభ్యులు ఉంటే ఆ బాధ ఏంటో మీకు తెలుస్తుంది అని ఆమె ఫైర్ అయ్యారు. కోవిడ్ రోగుల ప్రతి మరణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి అని కోరారు.