రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పట్టుమని పది రోజులు కూడా కాలేదు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన పనుల్లో బిజీబిజీ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసేందుకు ఆయన దిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో హస్తినలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. ఉమ్మడి ఏపీ భవన్ ఆస్తుల వివరాలను ఆయనకు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఏపీ భవన్‌లో రాష్ట్ర వాటాను మ్యాప్ ద్వారా వివరించారు. ఆ భవన్‌లోని పలు బ్లాక్‌లను మంత్రి కోమటిరెడ్డి పరశీలించారు. అనంతరం తెలంగాణభవన్ నిర్మాణ స్థలం పరిశీలించి మీడియాతో మాట్లాడారు.
“ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన 19 ఎకరాలను పరిశీలించాం. దిల్లీలో తెలంగాణభవన్ నిర్మాణ వివరాలు సీఎంకు వివరిస్తా. దిల్లీలో తెలంగాణభవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైంది. ఉమ్మడి ఏపీ భవన్ విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం లేదు. ఏప్రిల్ నాటికి తెలంగాణ భవన్ నిర్మాణ పనులు చేపట్టాలనుకుంటున్నాం.” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.