సరిహద్దు ప్రాంతాలను అధీనంలోకి తీసుకుని శాశ్వతంగా పాగా వేయాలని చైనా ఎన్నో ఏళ్ల నుంచి కుట్రలు పన్నుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సరిహద్దుల్లో ఇతర దేశ భూభాగాల్లో తన ఆక్రమణలు కూడా మొదలుపెట్టించింది. ఈ క్రమంలోనే భూటాన్ సరిహద్దులోనూ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. సరిహద్దు వెంబడి ఏకంగా గ్రామాలనే ఏర్పాటు చేస్తోంది. తాజాగా జకర్‌లుంగ్ లోయలో డ్రాగన్ చేపట్టిన అక్రమంగా నిర్మాణాల ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి.
ఒకవైపు సరిహద్దు వివాదంపై భూటాన్‌తో అధికారికంగా చర్చలు జరుపుతూ మరోవైపు భూటాన్ భూభాగంలో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతూ తన ద్వంద్వ వైఖరిని చూపిస్తోంది. శాటిలైట్ చిత్రాల్లో సరిహద్దు వెంబడి రెండు చోట్ల భవనాలను చైనా నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదటి ఎన్‌క్లేవ్‌లో దాదాపు 129 భవన నిర్మాణాలు కనిపించగా, కొద్ది దూరంలో ఉన్న రెండో ఎన్‌క్లేవ్‌లో మరో 62 భవనాలు కనిపించాయి. మొత్తం 191 భవనాలను చైనా నిర్మిస్తోంది.
భూటాన్ సమీపంలో 2020 నుంచే చైనా నిర్మాణ పనులు చేపట్టింది. మొదట ఆ ప్రాంతాల్లో రాకపోకలకు వీలుగా రోడ్లు నిర్మించి ఆ తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని షురూ చేస్తూ క్రమంగా వాటిని నివాస ప్రాంతాలుగా అభివృద్ధిపరిచింది.