ఉపరితల ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రోజూ మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉక్కపోతతో విలవిలలాడుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు వర్షపు జల్లులు కాస్త ఊరట కలిగించాయి. అయితే ఒక్కసారిగా భారీ వానలు పడటంతో నగరమంతా జలమయమైంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాల నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడ ఇబ్బందులైనా వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాలని చెప్పారు. సెక్రటేరియట్, రాజ్ భవన్ రోడ్, మసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతాలతో పాటు నగరంలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.