తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపారు. సర్పంచులకు చెల్లించాల్సిన 16 నెలల బిల్లులు రూ.1200 కోట్లను గత కేసీఆర్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీతక్క ఆరోపించారు. ఎప్పటికప్పుడు సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదని ఆమె అన్నారు.
తన కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడారు. ఉద్యోగులకు ప్రతినెలా 5లోపు జీతాలు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసమే నిధులను వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అభయహస్తం గ్యారంటీల అమల్లో తమ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క తెలిపారు.