యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే తొలిసారి ‘టాస్క్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. టాస్క్‌ను తొలిసారిగా పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయునున్నట్లు వెల్లడించారు. కలెక్షరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈ ప్రకటన చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు వివరణ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా పునర్విభజన ఉండబోదని దీనిపై బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకోలు, ధర్నాలు చేయాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పనులను అస్తవ్యస్తంగా చేపట్టిందని దీనిపై అధికారులు వాస్తవ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో పరిశ్రమలు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉందని శ్రీధర్ బాబు హామీ అన్నారు. జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.