అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దీని ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడించారు. శాసనసభలో ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని.. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయని అన్నారు. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని పేర్కొన్నారు. ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.
“స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్ వర్సిటీ ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, అప్రెంటీషిప్ పెట్టాలనుకుంటున్నాం. సుమారు 60 శాతం మంది అధ్యాపకులు నిపుణులు ఉంటారు.” అని శ్రీధర్ బాబు వివరించారు.