శాసనసభ సమావేశాలు తిరిగి గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీకి వచ్చారు. అంతకుముందు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. ఎమ్మెల్యేలు, సభ ప్రతిష్టకు భంగం కలిగేలా సీఎం వ్యాఖ్యలు చేశారని.. ఆయన వ్యాఖ్యలపై చర్చ కోసం తీర్మానం ఇచ్చింది.
మరోవైపు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం, డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా నేతలపై వారి వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళలపట్ల అవమానకరంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. సబిత, సునీతకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలంతా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని గమనిస్తున్నారని.. సరైన సమయంలో కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ అన్నారు.