ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయం మరింత హాట్ హాట్ గా మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందనే వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో భాగంగానే.. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు తెలిసింది. ఈటల రాజేందర్‌ను తప్పించిన తర్వాత కొత్తగా ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న ఆ స్థానంలోకి మహేందర్‌రెడ్డిని తీసుకొంటారని, ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ అందుబాటులో ఉన్నప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని సమాచారం.
ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్‌రెడ్డి తాండూరు నుంచి పోటీ చేయాలనుకున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇస్తామంటే ప్రత్యామ్నాయం చూసుకొంటానని పార్టీ దృష్టికి తెచ్చినట్లు కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనాయకులు జోక్యం చేసుకొని ఆయనతో చర్చించాక.. తాండూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విజయానికి సహకరించడానికి అంగీకరించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి సోమవారం అభ్యర్థుల ప్రకటన కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా మహేందర్‌రెడ్డి వెళ్లడం గమనార్హం.