మూసీ పునరుజ్జీవనం పై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాపూఘాట్ వద్ద నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ తో పాటు మీర్ ఆలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జీ నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మీర్ ఆలం ట్యాంక్ పై బ్రిడ్జీ నిర్మాణ పనులకు జూన్ లో టెండర్లు పిలవాలని ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు డిజైన్లతో డీపీఆర్ ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
మీర్ ఆలం ట్యాంక్ పై నిర్మించే బ్రిడ్జీకి సంబంధించి కన్సెల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జీని అద్భుతంగా, సందర్శకులు, ప్రయాణికుల రక్షణకు అధిక ప్రాధన్యత ఉండే విధంగా డిజైన్లను ఎంచుకోవాలన్నారు. ఈ బ్రిడ్జీతో పాటు మీర్ ఆలం ట్యాంక్ లో వివిధ చోట్ల ఐలాండ్లు ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని తెలిపారు. సింగపూర్ లోని గార్డెన్స్ బై ది బే ను తలపించేలా బర్డ్స్ పారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలన్నారు.