తెలంగాణ బోనాల సంబురాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ పాతబస్తీలో లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగ చివరి రోజు సందర్భంగా లాల్‌దర్వాజ ఆలయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
బీజేపీ సీనియర్ నేతలు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు ఇండియా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ లాల్‌దర్వాజ బోనాల పండుగలో పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. లాల్ దర్వాజ్ బోనాల జాతరకు రావడం ఇదే మొదటి సారి అని మిథాలీ చెప్పారు. 115 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని దర్శించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు.