తెలంగాణలో ఎన్నికల వేడి షురూ అయింది. ప్రధాన పార్టీలన్నీ ప్రజలను ఆకర్షించడంలో బిజీ అయ్యాయి. ఇక అభ్యర్థుల జాబితా ప్రకటించిన అధికార బీఆర్ఎస్ కాస్త ఎక్కువ జోష్ చూపిస్తోంది. అయితే ఈ జోష్‌లో అధికార పార్టీ నేతలు నోరుజారుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే ప్రభుత్వ విప్.. ఎమ్మెల్యే బాల్క సుమన్.. కాంగ్రెస్ వాళ్లంతా మనోళ్లే.. వాళ్లనేం అనొద్దంటూ కార్యకర్తలకు సూచించడం రాష్ట్రంలో కలకలం రేపింది.
ఇక తాజాగా అధికార పార్టీకి చెందిన నాగర్‌కర్నూల్ మర్రి జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. నా జోలికొస్తే కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగర్‌కర్నూల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికే టికెట్ కేటాయించడంతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఆయన.. నియోజకవర్గవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు.
తెల్కపల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న మర్రి జనార్దన్‌రెడ్డి…. నిన్న రాత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోపంతో ఊగిపోయిన ఆయన.. కాంగ్రెస్ కార్యకర్తలపై నిప్పులు చెరుగుతూ.. కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తానన్నారు. తాను తలుచుకుంటే కాంగ్రెస్ చేయి ఊడిపోతుందని.. తన జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చిపడేస్తానంటూ హెచ్చరించడం వివాదాస్పదమైంది.