తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే ప్రచారాలతో పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఇక ఎన్నికల ప్రచారంలో.. టీవీల్లో చర్చావేదికలు కామన్. అలా ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా వేదికకు వెళ్లిన అధికార పార్టీ ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో ‘నియోజకవర్గంలో గెలుపెవరిది’ అనే అంశంపై మాట్లాడేందుకు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి.. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత్‌రెడ్డి వెళ్లారు. ఈ అంశంపై మాట్లాడుతుండగా బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు భూ ఆక్రమణ విషయంపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.
‘భూఆక్రమణలను మీరు ప్రోత్సహిస్తుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయ’ని ఎమ్మెల్యే వివేకానందను కూన శ్రీశైలం గౌడ్ విమర్శించడంతో పరస్పరం వాగ్వాదం చోటుచేసుకుంది. నువ్వు కబ్జాలకు పాల్పడుతున్నావంటే.. నువ్వు ఆక్రమణలకు పాల్పడుతున్నావంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు ఇరువురు అభ్యర్థులు. ఇక ఓ క్రమంలో ‘మీ తండ్రి కూడా కబ్జాలు చేశాడు’ అని శ్రీశైలంగౌడ్ ఆరోపించడంతో ఎమ్మెల్యే వివేకానంద ఆయన వద్దకు వెళ్లి నెట్టేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్యకర్తలను చెదరగొట్టారు.