బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఆయణ్ను, ఆయన కుటుంబాన్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని రాజాసింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అంతే కాకుండా పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదు లేఖను కూడా విడుదల చేశారు.
‘‘నన్ను, నా కుటుంబాన్ని, ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు రానున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 1.59 గంటలకు నాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపే చంపేస్తామని బెదిరించాడు. ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేకమార్లు ఇతర దేశాల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. వెంటనే సీపీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినా.. వారిపై ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బెదిరిస్తూ ఫోన్ చేసిన వ్యక్తి సుమారు 6 నిమిషాల పాటు మాట్లాడాడు. నా కదలికల గురించి తెలుసని, ఏ సమయంలోనైనా చంపేస్తానని చెప్పాడు. ఎవరెన్ని బెదిరింపులకు పాల్పడినా.. మా సంకల్పం అఖండ హిందూ రాష్ట్ర సాధనే’’ అని రాజాసింగ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.