జీవో నెంబర్ 317, 46 లను సమీక్షించి సవరించేందుకు మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన సబ్ కమిటీ వేయడం హర్షణీయం అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఈరోజు ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన తెలంగాణ తెచ్చుకున్న కారణాల్లో ఉద్యోగాలు ఒకటని పేర్కొన్నారు. 317 జీవో వల్ల ఉద్యోగులకు చాలా అన్యాయం జరిగిందని తెలిపారు. ఆ నష్టాన్ని పూడ్చేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని చేర్చినట్టు చెప్పారు. చెప్పినట్టుగానే ప్రస్తుతం సబ్ కమిటీ వేసిందని వెల్లడించారు. రెండు నెలల్లోగా కమిటీ నివేదిక వస్తుందని వ్యాఖ్యానించారు.
మరోవైపు పాత ఉమ్మడి జిల్లా వారీగా జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి కోరారు. 10 జోన్లు, 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్లు స్థానికతకు దూరంగా వెళ్లిన జోన్లలో 20 ఏళ్ల వరకు కొత్త ఉద్యోగాలు రావని.. అలాంటి వాటిని సవరించాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడే ఇవన్నీ చేయవచ్చన్న ఆయన సీపీఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు అయ్యేలా చూడాలని కోరారు. అందుకు సంబంధించి ఈ నెల 4వ తేదీన తాను సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో ఈ విషయాలన్నింటినీ ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.