బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. 24 గంటల్లోపు తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. తను ఇచ్చిన సమయంలో నిరూపించలేకపోతే అర్వింద్ తన ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్ బోర్డు తెచ్చినా.. అర్వింద్ తాను ఎంపీ అయిన తర్వాత ఆ బోర్డు తీసుకు వచ్చానని చెబుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. కానీ వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు సరైనవి కావని హితవు పలికారు.
‘‘ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్ బోర్డు తెచ్చినా.. అర్వింద్ తెచ్చానని చెబుతున్నారు. ఇప్పుడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నేను, నాన్న, అన్న, రాజకీయాల్లో ఉన్నాం అని సహించాం. నా భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదు’’ అని కవిత అన్నారు.