అమరులకు క్షమాపణ చెప్పండి.. సోనియా, రాహుల్​పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

-

కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు వస్తున్న రాజకీయ టూరిస్టులకు స్వాగతమంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బిర్యానీ తిని సంతోషంగా వెళ్లండి కానీ… ప్రజల్ని మరోసారి మభ్యపెట్టొద్దని హితవు పలికారు. రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేసి ఎంతో మంది పౌరుల ప్రాణాలు తీసిన వాళ్లు మళ్లీ తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ అమరులకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్​కు బీజేపీతో పొత్తు కుదిరిందని.. అందుకే సోనియా, రాహుల్​లపై ఈడీ కేసులు ముందుకు కదలడం లేదని కవిత అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఏమయ్యిందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య అవగాహనేమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కాంగ్రెస్‌ పార్టీకి చిత్తుశుద్ధి లేదంటూ విమర్శించారు. ఇరవై ఏళ్లుగా పెండింగులో ఉన్న మహిళ రిజర్వేషన్ల బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు ముందే అమరులకు క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version