సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్‌ఏలోనే మోదీతో స్నేహం ఉందని, ఆయన త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు. సీఎం రేవంత్ భాష ఎలా ఉందన్న కవిత.. ఆయనపై కేసులు పెట్టాలని పేర్కొన్నారు.
“మహిళల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తాం. రేపు ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తాం. 2 జాతీయ పార్టీలూ బీఆర్ఎస్ను బొంద పెట్టాలని చూస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో భారాస గెలవకపోతే ప్రజలకే నష్టం. రేవంత్ పదవి గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల గురించి కాదు. కేసీఆర్ను నియంత అన్న మేధావులు ఏం చేస్తున్నారు? బీసీల విషయంలో ఆగమాగమై తీర్మానం చేశారు. దాంతో వచ్చేది ఏమీ లేదు. ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరుగుతోంది, రేపు విద్యా అవకాశాల్లో కూడా అన్యాయం జరుగుతుంది.” అని కవిత అన్నారు.