కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ తలుచుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమల్లోకి తీసుకురావొచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులో ఓబీసీ మహిళలను విస్మరించటం సరైంది కాదని అన్నారు. రష్యా అధికార వార్తా సంస్థ స్పుత్నిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా రిజర్వేషన్ బిల్లు, దాని పర్యవసానాలు, నేపథ్యంపై కవిత మాట్లాడారు.
వచ్చే ఎన్నికల నుంచే రిజర్వేషన్లు అమలు కావడం లేదన్న అసంతృప్తి ఉందని.. ఈ బిల్లును తక్షణమే అమలు చేయడం సాధ్యమేనని ఈ ఇంటర్వ్యూలో కవిత పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అసంబద్ధమైన సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాతనే డీలిమిటేషన్ జరగాల్సి ఉందని.. దానికి మహిళా రిజర్వేషన్లకు సంబంధం లేదని తెలిపారు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఎత్తిచూపుతూ రిజర్వేషన్లను జాప్యం చేస్తోందని.. ప్రభుత్వం తలచుకుంటే, రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయవచ్చని స్పష్టం చేశారు. అందుకు 2011 జనాభా లెకలను ఆధారంగా చేసుకోవచ్చని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.