మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. సోమవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2013లో ఎమ్మెల్యేగా మొదటి ఎన్నికతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది.
ఆ తర్వాత 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆయన ఎన్నికయ్యారు.ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జులై 2, 2020న క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి రాష్ట్ర రాజకీయాలలో యాదవ్ ప్రభావం మరింత పటిష్టమైంది. మూడుసార్లు ఉజ్జయిని దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మోహన్ యాదవ్ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపడంతో కీలక పదవి ఆయనను వరిచింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది తేల్చేందుకు హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్, తెలంగాణ నుంచి ఎంపీ, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తదితరులు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి మోహన్ యాదవ్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.