జూన్ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు

-

రానున్న వానాకాలంలో తెలంగాణలో సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్‌- సెప్టెంబరు నెలల మధ్య వర్షాల ప్రభావంపై హైదరాబాద్‌ వాతావరణశాఖ నివేదిక విడుదల చేసింది. ఎల్‌ నినో పరిస్థితులు జూన్‌ నాటికి పూర్తిగా బలహీనపడతాయని అధికారులు తెలిపారు. లా నినా పరిస్థితులు జులైలో పుంజుకుంటాయని, నైరుతి రుతుపవనాలు జూన్‌ 8, 11వ తేదీల మధ్య రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.

ఆ వెంటనే వానలు ప్రారంభమై జులైలో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. ఆగస్టులో సాధారణ రీతిలో కొనసాగుతూ.. తిరిగి సెప్టెంబరులో అధికంగా కురుస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని కొంత భాగంలో అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించారు. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడం, లెక్కకు మించి వానల విరామ కాలాలు నమోదవడంతో సాగుకు విఘాతం కలిగిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు నిండుకుని క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దఫా మాత్రం అలా ఉండదని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news