ముగ్గురు పిల్లలతో మిడ్​మానేర్​లో దూకిన తల్లి.. నలుగురు మృతి

-

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలో ఓ తల్లి తన ముగ్గురు పిల్లలతో కలిసి దూకింది. ఈ ఘటనలో తల్లితో పాటు ముగ్గురు పిల్లలు కూడా మృతి చెందారు. కరీంనగర్‌లో నివసిస్తున్న రజిత తన పిల్లలు ఏడేళ్ల అయాన్, ఐదేళ్ల కూతురు అసరజా సహా 14 నెలల పసికందు ఉస్మాన్‌తో రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నీటిలో తేలియాడుతున్న మృత దేహాలను చూసి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

వేములవాడ మండలం రుద్రవరానికి చెందిన రజిత, కరీంనగర్ వాసి మహమూద్‌ అలీ కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కుటుంబంలో కలతలు లేదా ఏదైనా ఆర్థిక సమస్యలతో రజిత ఈ ఘాతుకానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు సహా తల్లి బలవన్మరణం చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పసిపిల్లలతో కలిసి తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడటంస్థానికులను తీవ్రంగా కలచివేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version