రాష్ట్ర శాసనసభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఓవైపు జాతీయ నేతలను రంగంలోకి దింపి.. ప్రచారంలో వేగం పెంచడమే గాక.. మరోవైపు అభ్యర్థుల ప్రచారం హోరెత్తుతోంది. ఈ క్రమంలోనే జగిత్యాల బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
తన తండ్రి డి.శ్రీనివాస్‌ను అణగదొక్కింది కాంగ్రెస్సే అని అర్వింద్ ఆరోపించారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన డి.శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రిని చేయకుండా కిరణ్ కుమార్ రెడ్డిని చేసిందని మండిపడ్డారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క బీసీ అభ్యర్థి దొరకలేదా అని ప్రశ్నించారు. బీజేపీ మాత్రమే బీసీ సీఎంను ప్రకటించిందని.. మిగతా పార్టీలకు ఆ దమ్ము లేదని మరోసారి వ్యాఖ్యానించారు.
మరోవైపు బీఆర్ఎస్పై విమర్శిలు కురిపిస్తూ.. ఆ పార్టీ నేతలు గ్రామాల్లో గంజాయి, మద్యం గొలుసు దుకాణాల ద్వారా యువతను మత్తుకు బానిస చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంతో యువతను పదేళ్లు చదువుకు దూరం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మరో దశాబ్దకాలం ఒక తరాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.