రాష్ట్రంలో ఎన్నికల జోష్ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పాదయాత్రలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమావేశాలు, బస్సు యాత్రలు, రోడ్ షోలు ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో తన జోరు సాగిస్తుండగా.. కాంగ్రెస్ కూడా తామేం తక్కువ కాదంటూ ఊపందుకుంది.
ఇక బీజేపీ ప్రచారంలోకి కాస్త లేటుగా దిగినా.. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. బీసీ సీఎం నినాదంతో బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జరిగిన బీజేపీ బూత్‌స్థాయి సమావేశంలో బీజేపీ అభ్యర్థి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో హంగ్ వచ్చినా ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తోందని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ మంచోడని ఆయన వ్యాఖ్యానించారు.రాజకీయాలు ఎన్నికలకు ముందే కాకుండా.. ఎన్నికల తర్వాత కూడా ఉంటాయంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెజార్టీ వచ్చినా.. హంగొచ్చినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు.