గతంలో తనను అరెస్టు చేసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో ఎవరితో మాట్లాడారో తెలుసునని రఘురామకృష్ణ రాజు తెలిపారు. డిజి అనుమతి తీసుకుని నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి తనను అక్రమంగా నిర్బంధించారని, ఆ తర్వాత సైబరాబాద్ సీపీగా వ్యవహరించిన స్టీఫెన్ రవీంద్ర సహకారంతో తనను అంతమొందించాలని చూశారని, నకిలీ పోలీసులు తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా తనకు రక్షణగా ఉన్న సి ఆర్ పి ఎఫ్ పోలీసు బలగాలు వారిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని ఆరోపణలు చేశారు.. అప్పుడు తన ఉంగరం పోయిందని నకిలీ పోలీసు చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు తనపై, తన కుమారుడిపై తిరిగి కేసులు నమోదు చేశారని తెలిపారు.
ఈ కేసులో హైకోర్టులో స్టే లభించకపోతే, సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తీసుకోవలసి వచ్చిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారితో తెలంగాణ పోలీసులు, అక్కడి నాయకులు కుమ్మక్కయ్యారని, వీరంతా తోడుదొంగలేనని, సీతారామాంజనేయులు గారు, తెలంగాణ డిజితో మాట్లాడారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి హైదరాబాద్ పర్యటనలో భాగంగా సెక్యూరిటీ కోసం తన ఇంటి బయట పోలీసులను కాపలాగా పెట్టారని, గచ్చిబౌలి ఎక్కడా?, బేగంపేట ఎక్కడా?? అని ప్రశ్నించిన రఘురామకృష్ణ రాజు , మోడీ హైదరాబాదు నుంచి వెళ్లిపోయిన తర్వాత తన ఇంటి వద్ద కాపలా పెట్టిన వ్యక్తి ఎవరికో ఉప్పందించడానికి తచ్చాడుతూ తిరుగుతూ ఉంటే, సిఆర్పిఎఫ్ పోలీసులు పట్టుకొని ఐడి కార్డు చూపించాలని ప్రశ్నిస్తే… తమ పైనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూశారన్నారు.