రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సాగర్కు పెద్ద ఎత్తున ప్రవాహం పోటెత్తుతుండటంతో జలకళను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో నిండుకుండలా మారిన సాగర్ డ్యామ్ 2 క్రస్ట్ గేట్లను నీటిపారుదల శాఖ అధికారులు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 2 గేట్ల ద్వారా 16,200 క్యూసెక్కుల నీటిని కిందకు పంపిస్తున్నారు.
నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం అంతే నీటిమట్టంలో నీరు నిల్వ ఉంది. నసాగర్ ఇన్‌ఫ్లో, 64,699 క్యూసెక్కులు ఉండగా రెండు గేట్లు తెరిచి అంతే క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తి నిల్వసామర్ధ్యం 312.50 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం అంతే నీరు జలాశయంలో నిల్వ ఉంది. మరోవైపు సాగర్ డ్యామ్ గేట్లు తెరుచుకోవడం.. వీకెండ్ కావడంతో ఇవాళ సాగర్ వద్దకు పర్యాటకులు బారులు తీరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సాగర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టారు.