తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న విచారణ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి తప్పుకున్న విషయం తెలిసిందే. విచారణ కమిషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ, కేసీఆర్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో తాజాగా కొత్త ఛైర్మన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు.
విద్యుత్ కొనుగోళ్లపై దర్యాప్తు చేస్తున్న విచారణ కమిషన్కు కొత్త ఛైర్మన్‌ను ఇవాళ సాయంత్రం నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో విద్యుత్ కొనుగోళ్ల అంశంపై మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్‌రెడ్డి చేశారని రేవంత్ చెప్పారు. జైపాల్‌రెడ్డి కృషి వల్ల వినియోగం ఆదారంగా తెలంగాణకు 54 శాతం వచ్చేలా విద్యుత్ విభజన జరిగిందని తెలిపారు. ఉత్పత్తి, సామర్థ్యం ప్రకారం 36 శాతం తెలంగాణలో, 64 శాతం ఏపీలో ఉందని.. విభజన చట్టంలో తెలంగాణకు 36 శాతం, ఏపీకి 64 శాతం విద్యుత్ వచ్చేలా ఉందని పేర్కొన్నారు. తెలంగాణను చీకట్ల నుంచి కాపాడింది జైపాల్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు.