తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి రాత్రిపూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సాయంత్రం 5 అయిందంటేనే ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఇక తెల్లవారుజాము సంగతి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఉదయం 10 గంటల దాక సూర్యుడు కూడా చలికి వణుకుతూ దాక్కుంటున్నాడు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వారం రోజుల నుంచి మెదక్, అదిలాబాద్‌లో 12 నుంచి 13 డిగ్రీల కనిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోనూ 15 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొంది. చలి కారణంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని తెలిపింది. మరోవైపు చలి పెరిగిన కారణంగా రాత్రిపూట రహదారులపై జనసంచారం బాగా తగ్గింది. రహదారులపై ట్రాఫిక్ సైతం నామమాత్రంగా ఉంటోంది.
మరోవైపు తెల్లవారుజామున పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతేనే తప్ప ఆ సమయంలో వాహనదారులు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పొగమంచు కారణంగా రహదారి కనబడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున.. ఒకవేళ తెల్లవారుజాము సమయంలో బయటకు వచ్చినా జాగ్రత్తగా వెళ్లాలని చెబుతున్నారు.