ఈ ఏడాది శబరిమలకు భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ రద్దీ నెలకొంటోంది. అయ్యప్ప స్వామి దర్శనానికి గంటలు కాదు రోజుల సమయం పడుతోంది. ఈ క్రమంలో కొంత మంది భక్తులు స్వామి దర్శనం పూర్తి కాకుండానే వెనుదిరుగుతున్నారు. మరోవైపు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు తాజాగా ఓ లేఖ రాశారు.
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. భక్తులకు ఏర్పాట్లు చేసే విషయంలో.. పంబానది పరిసరాలు, సన్నిధానం వరకు పాదయాత్ర, ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో భక్తులకు సహాయం చేసే విషయంలో.. స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా భాగస్వాములను చేసేదిశగా చొరవతీసుకోవాలని కోరారు.