తప్పుడు డిజైన్లతో ‘కాళేశ్వరం’ అనుమతులు పొందారు : నితిన్ గడ్కరీ

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఊపందుకుంది. జాతీయ నేతలను రంగంలోకి దించుతున్న రాష్ట్ర నాయకత్వం.. కేసీఆర్, కాంగ్రెస్​లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశాలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రోజున కామారెడ్డి జిల్లా, నాగర్​కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్​పై విరుచుకు పడ్డారు.

తెలంగాణ సర్కార్ తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు పొందిందని నితిన్‌ గడ్కరీ ఆరోపించారు. తాను కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేశానని తెలిపారు. అయితే.. కేసీఆర్‌ ఇంజినీర్‌గా అవతారమెత్తి రూపొందించిన తప్పుడు డిజైన్ల కారణంగా ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు నితిన్ గడ్కరీ.

నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నామని చెప్పుకునే కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతితో మొదటి హామీని తుంగలో తొక్కారని.. ఇక నిధుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని.. ఇక నియామకాలు చేపట్టి ఉద్యోగులకు ఉపాధి కల్పించాల్సిన కేసీఆర్.. తన కుమారుడు, కుమార్తెకు రాజకీయ ఉపాధి కల్పించడంపైనే ఫోకస్ పెట్టారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అవినీతి లేని రామరాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news